Saturday, April 4, 2015

OUR MOVIE PARAMPA REVIEW

సినిమా రివ్యూ : పరంపర

Sakshi | Updated: November 12, 2014 01:09 (IST)
సినిమా రివ్యూ : పరంపర
పిల్లలను ఎలా పెంచాలి? దీన్ని ఒకప్పటి తరాలు పెద్ద విషయంగా తీసుకోలేదేమో కానీ, ఇవాళ ఆకాంక్షలు, అవకాశాలు పెరిగి, పిల్లల భవితవ్యంపై పెద్దల నిర్ణయాల ఒత్తిడి పెరిగిపోతున్న సందర్భంలో కీలకంగా మారింది. పిల్లలకు ఆసక్తి ఉన్న అంశాన్ని వదిలేసి, వారి మీద పెద్దలు మరేదో బలవంతాన రుద్దితే.. తలెత్తే విపరిణామాలు చూస్తూనే ఉన్నాం. ఈ సందర్భంలో మూడు తరాల కథగా, ప్రకృతి నేపథ్యంలో పిల్లల వికాసానికి తల్లితండ్రుల ప్రోత్సాహం ఎంత అవసరమో చెప్పడానికి చేసిన చిరు ప్రయత్నం - ‘పరంపర’.
 
కథ ఏమిటంటే.: అనగనగా ఒక పట్నం అబ్బాయి. అతని పేరు - పవన్ (మాస్టర్ సాయితేజ). స్కూలులో చదువుకుంటూ, షటిల్ బ్యాడ్మింటన్ అంటే పిచ్చి ప్రేమతో ఉంటాడా అబ్బాయి. అతని తండ్రి రాఘవ (నరేశ్). బ్యాడ్మింటన్ పట్ల కొడుకుకున్న ఆసక్తిని మాత్రం ప్రోత్సహించడు. ఆ అబ్బాయి తాత పరంధామయ్య (రావి కొండలరావు). పల్లెటూళ్ళో ఉంటాడు. పరంధామయ్య తన కొడుకు రాఘవను కవిత్వానికి దూరం చేయడంతో, రచనాసక్తిని చంపుకొని, ఇలా చిరు ప్రభుత్వోద్యోగం చేస్తుంటాడు. రాఘవ కుటుంబం చాలా కాలం తరువాత దీపావళికి పల్లెటూరుకు వెళుతుంది. అక్కడ తన తండ్రికి చిన్నప్పటి నుంచి ఉన్న కవితాసక్తి పవన్‌కి తెలుస్తుంది. పిల్లాడిలోని బ్యాడ్మింటన్ ప్రేమ తండ్రికర్థమవుతుంది. అక్కడ మలుపు తిరిగే కథతో సాగుతుంది ‘పరంపర’.
 
ఎలా నటించారంటే: సీనియర్ నటుడు నరేశ్‌లోని భావప్రకటన సామర్థ్యాన్ని ఈ చిత్రంలో మరోసారి చూడవచ్చు. పరిశ్రమ సరైన పద్ధతిలో వినియోగించుకుంటే, తెలుగు సినిమాకు మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుల కొరత లేదనడానికి ఇందులోని సన్నివేశాలే నిదర్శనం. నరేశ్ భార్య పాత్రలో ఆమని పరిధి మేరకు నటించారు. అయిదు దశాబ్దాల పైగా సినీ నటనానుభవమున్న రావి కొండలరావు తాతయ్య పాత్రలో సెంటిమెంట్ పండించారు. చిన్ననాటి పవన్‌గా బాలనటుడు మాస్టర్ సాయితేజ బాగున్నాడు. పెద్ద పవన్ పాత్రను సంతోష్ సమ్రాట్ ధరించారు.     
 
ఎలా ఉందంటే: ఇంజనీరింగ్ చదువుల సంతలో మారుపడిపోతున్న సమయంలో తండ్రీ బిడ్డల మధ్య ఉండే అనుబంధాన్నీ, పిల్లలకున్న నిజమైన ఆసక్తి పట్ల పెద్దలకు ఉండాల్సిన అక్కరనూ గుర్తు చేసే కథాంశమిది. ఒక తరం ప్రేక్షకులను తమ చిన్ననాటి జ్ఞాపకాల్లోకి తీసుకువెళ్ళి, అక్కడ కాసేపు వదిలేసి, ఆగి ఆలోచింపజేస్తుంది.కొడుకు ఆసక్తిని గమనించకుండా గుమాస్తా గిరిలోకి నెట్టేసిన ఒక తండ్రి, పిల్లాడిలోని ప్రతిభకు నారుపెట్టి నీరుపోయకుండా నిర్లిప్తతలోకి జారిపోయిన కొడుకు, మనవడిలోనైనా కొడుకు విజయాన్ని చూసుకోవాలనుకొనే ఒక తాత - ఈ పాత్రలన్నీ జీవితంలో నుంచి తెరపైకొచ్చినవే. నరేశ్ పాత్ర పరిధి ఎక్కువుండే ఫస్టాఫ్ కొన్నిచోట్ల మనసును తడి చేస్తుంది.
 
సినిమాటోగ్రాఫర్‌గా అనుభవం, పేరు సంపాదించుకున్న మధు మహంకాళి తొలిసారిగా మెగాఫోన్ పట్టిన చిత్రమిది. దర్శక - నిర్మాతగా తొలి అడుగు కావడం, పరిమిత వనరుల ప్రయత్నం అవ్వడం వల్ల... స్క్రిప్టులో, చిత్రీకరణలో నెరుసులున్నాయి. అయినా లక్షలు వెచ్చించి చేసిన ఈ సాహసాన్నీ, యూనిట్ చిత్తశుద్ధినీ శంకించలేం. పిల్లల ఆసక్తిని గమనించి భుజం తడితే, ఎంచుకున్న రంగంలో వారు ఉన్నతంగా ఎదుగుతారని ఈ ఆధునిక తరం తల్లితండ్రులకు సున్నితంగా గుర్తు చేస్తుందీ సినిమా. అందమైన, ఆకుపచ్చ జ్ఞాపకాల పల్లెటూరు, కలువలు పూచే చెరువు, డొంకబాటలు, కల్మషం లేని ఆటపాటలు - అన్నిటినీ ప్యాన్ చేసుకుంటూ, కెమేరా కన్ను తన వెంట ప్రేక్షకుల్ని తీసుకువెళుతుంది. రొటీన్ సినిమాలకు భిన్నంగా ఇదొక రిఫ్రెషింగ్ అనుభవం.
 
అలాగే, నేపథ్య సంగీతం కొన్ని ఘట్టాల్లో ఆర్ద్రతను పెంచింది. నేపథ్యంలో వచ్చే పాటలూ, కొన్నిచోట్ల కవితాత్మకమైన సంభాషణలూ సినిమాలో ఉన్నాయి. మరి, లోటుపాట్లు లేవా అంటే ఎందుకు లేవూ...ఉన్నాయి. అయితే, రొటీన్ చిత్రాలకు భిన్నంగా, జీవితంలోని సెన్సిబులిటీస్‌తో ఇలాంటి ప్రయత్నాలు తెలుగు తెరపై జరగడమే అరుదైపోయిన రోజులివి. ఆ నేపథ్యంలో చిన్న బడ్జెట్ ప్రయత్నాలకుండే అనివార్యమైన బలహీనతలను సానుభూతితో అర్థం చేసుకుంటూనే ఈ ‘పరంపర’ను చూడాలి. ఆ దృష్టితో చూస్తే, మంచి సినిమాలను ఆశించే వారు కొరుకొనేది -  తెలుగులో ఇలాంటి ప్రయత్నాల ‘పరంపర’ కొనసాగాలని!
 
బలాలు:
* ఛాయాగ్రహణం
* రీరికార్డింగ్
* జీవితాన్ని ప్రతిఫలించే సన్నివేశాలు
* ఎంచుకున్న లొకేషన్లు  సహజ నటన
 
 బలహీనతలు:
* రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలలా లేకపోవడం  ఫైట్స్, ఐటమ్ సాంగ్స్ లేకపోవడం
* కామెడీ ట్రాక్‌లంటూ పెట్టకపోవడం